బాషా తేనె ఎలా మొదలైందో బాషా గారి మాటల్లో
బాషా తేనె మొదలవడానికి కారణం 1980 లో ప్రచురితమైన ఒక పత్రికలో గడ్డానికి తేనెటీగలు తగిలించికున్న ఒక ఫోటో. ఆ ఫోటో చూసినప్పుడు నేను కూడా ఈ విధంగా చేయాలి, అతను మనిషి నేను మనిషే, ప్రయత్నిస్తే నేను కూడా ఆ విధంగా చేయగలను అని తేనెటీగల గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. వంద రూపాయలు పెట్టి ఒక తేనెపెట్టెను కొన్నాను. అలా తేనె పరిశ్రమ ఒక వ్యాపకంలా మారింది.
అప్పట్లో నా జీవనం ఒక హోటల్లో టీ మాస్టారిగా సాగేది. ఒక హాబీ గా తేనె పరిశ్రమ గురించి కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తూ పరిశోధకులతో మరియు మిగతా రాష్ట్రాలలో ఉన్న పరిశ్రమదారులతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోగలిగాను. హోటల్లో పని చేస్తే వచ్చిన జీతంతో జీవనం సాగిస్తూ దీని అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుతో పరిశ్రమ పెంచుతూ ఉండడం జరిగింది. తరువాత హాబీగా ఉన్న తేనె పరిశ్రమను జీవనోపాధిగా మార్చుకుని టీ బాషా నుంచి తేనె బాషాగా మారాను.
నేను పరిశ్రమ మొదలు పెట్టిన కొత్తలో ఒకసారి డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు తేనె కోసం నా వద్దకు వచ్చి తేనె స్వచ్ఛత గురించి తెలుసుకొని వాడి చూసి ఇదేవిధంగా స్వచ్ఛమైన తేనెను వేడి చేయకుండా రసాయనాలు కలపకుండా ఇవ్వాలని ఎంతో ప్రోత్సహించి తేనె పరిశ్రమను పెంచమని చెప్పారు.
ఒక తేనెపెట్టె తో మొదలైన పరిశ్రమ అంచలంచలుగా పెరిగి ఇప్పుడు కొన్ని వేల పెట్టెలతో నడుస్తుంది. వేరే రాష్ట్రాలలో కూడా పరిశ్రమను పెట్టి ఎంతోమందికి స్వచ్ఛమైన తేనెను అందివ్వగలుగుతున్నాం. డాక్టర్ గారి ప్రోత్సాహం మరియు తేనెదాత సుఖీభవ అని మీ అందరి దీవెనలకు కృతఙ్ఞతగా నేను మీకు స్వచ్ఛమైన తేనెను అందిస్తూ ఉంటాను. నా నిజాయితీని నమ్మి నా చేత ఇంత గొప్ప కార్యాన్ని చేయిస్తున్న డాక్టర్ గారికి నా జీవితాంతం కృతజ్ఞుడిగా ఉంటాను.